బాలల హక్కుల్ని పరిరక్షించే బాధ్యత మనదే: మంత్రి సత్యవతి

తెలంగాణ ప్రభుత్వం బాలల హక్కులు, సంక్షేమం, సంరక్షణ కోసం ఎంతవరకు వెళ్లి అయినా పనిచేస్తుందన్న నమ్మకాన్ని కల్పించాల్సిన బాధ్యత మన మీద ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. బాలల హక్కుల సంరక్షణ రాష్ట్ర కమిషన్ నూతనంగా ఏర్పాటైన సందర్భంగా మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఏర్పాటు చేసిన రాష్ట్రస్థాయి సమావేశంలో ఆమె ప్రసంగించారు. ముఖ్యమంత్రి కేసిఆర్ ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండాలని, ముఖ్యంగా బాలలు, మహిళలకు ఎలాంటి లోటు ఉండకుండా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. ఇందులో భాగంగా జోగినపల్లి శ్రీనివాస్ రావు నేతృత్వంలో ఈ కమిషన్ ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో పిల్లలకు కచ్చితంగా మేలు జరుగుతుందన్న నమ్మకం తనకుందన్నారు. 


రాష్ట్రంలో చాలామంది బాలలు విధివంచితులుగా ఉన్నారని, వారు చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారని మంత్రి సత్యవతి రాథోడ్ ఆవేదన వ్యక్తం చేశారు. వారి హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత మనకు ఉందని, బాలలకు మనమంతా తోడుగా ఉన్నమన్న నమ్మకం కల్పించాలని కోరారు. బాలల చట్టాలను మనం చిత్తశుద్ధితో అమలు చేయగలిగితే మన రాష్ట్రంలో బాలలకు మంచి భవిష్యత్ అందించగలమన్నారు. మనతో వారి సమస్యలను చెప్పుకోలేని, నోరు లేని చిన్న పిల్లల సంరక్షణను చేసే బాధ్యత మనమీద ఉన్నప్పుడు మానవత్వంతో వారిని దగ్గరికి తీసుకోవాలన్నారు. తానేప్పుడు పుట్టిన రోజు జరుపుకోలేదని, అయితే ఈసారి మంత్రి అయిన సందర్భంగా నా శాఖలోని చిన్న పిల్లలతో పుట్టిన రోజు చేసుకోవాలనుకుని శిశు విహార్ లో వారితో గడిపినప్పుడు తనకు చాలా సంతృప్తినిచ్చిందని గుర్తు చేసుకున్నారు. శిశువిహార్ పిల్లలను కలిసినప్పుడు, వారి పరిస్థితిని చూసినప్పుడు, వారికోసం ఇంకా చాలా చేయాలన్న బాధ్యత కనిపించిందన్నారు.